Monday, July 16, 2012

రాహుల్‌గాంధీకి విషయం చెప్పిన తర్వాతే అధికారికంగా ప్రకటన


రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌ రెడ్డి విజయం సాధించడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌ ఇందిరా పార్క్ సమీపంలోని ఓ హోటల్‌లో జరిగిన ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 31,645ల ఓట్లకు పోల్ కాగా... 31,099 మాత్రమే చెల్లుబాటయ్యాయి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌ రెడ్డి... తన సమీప అభ్యర్థి, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తనయుడు అనీల్‌కుమార్‌ యాదవ్‌పై ఏడువేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వంశీచంద్‌కు 13799 ఓట్లు, అనీల్‌కుమార్‌కు 6326 ఓట్లు వచ్చాయి. యూత్‌ కాంగ్రెస్‌లో సభ్యులతో మంచి సంబంధాలు ఉన్న రవికుమార్‌ యాదవ్‌ (6167 ఓట్లు) మాత్రం అనూహ్యంగా మూడోస్థానానికే పరిమితం అయ్యాడు.
రిలయెన్స్‌పై దాడుల్లో వంశీచంద్‌ పాత్ర
వంశీచంద్‌ విజయం సాధించినా… జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రతినిధులు మాత్రం దాన్ని ప్రకటించలేదు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత టీవీ 5 ఛానల్‌లో వచ్చిన కథనం ఆధారంగా రిలయెన్స్‌ సంస్థలపై దాడులు జరిగాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ దాడుల వెనక వంశీచంద్‌రెడ్డి ఉన్నారని... అప్పట్లో ఆయనపై పలుకేసులు ఉండడం వల్ల గెలుపొందినట్టు ప్రకటించేందుకు వెనకాడుతున్నారని సమాచారం. రాహుల్‌గాంధీకి విషయం చెప్పిన తర్వాతే అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.
పనిచేసిన సామాజిక వర్గం
వంశీచంద్‌కు ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసిన అనుభవం, సామాజిక వర్గం, విజయవాడ ఎంపీ లగడపాటి మద్దతు సహకరించాయని యువజన కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందే డబ్బు పంపకం జరగకుండా నిఘా పెట్టాలని రాహుల్ గాంధీ ఆదేశించినప్పటికీ... ఈ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చుచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌ కార్యకర్తల విజయం: వంశీచంద్‌
తన విజయం వెనక కాంగ్రెస్‌ కార్యకర్తల కఠోర శ్రమ ఉందని వంశీచంద్‌ అన్నారు. రాహుల్‌గాంధీ ఆకాంక్షమేరకు యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు సైతం ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం మంచి పరిణామమన్నారు. వంశీచంద్‌పైన ఉన్న ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా… ‘నాకు ఆ విషయం తెలియదు. ఎందుకు ప్రకటన చేయలేదో వారినే అడగండి’ అని సమాధానమిచ్చారు.

No comments:

Post a Comment