కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తర్వాత అవిశ్వాసం అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికున్న స్టామినా ఎంతో తెలియదు గాని... అసలు విపక్షాలకు అవిశ్వాసం పెట్టే ఉద్దేశం ఉందా అన్నదే ఇప్పుడు అంతుపట్టని అంశం. పైకి మాత్రం టీడీపీ, జగన్ పార్టీ, టీఆర్ఎస్‌తో సహా అన్ని పార్టీలు కిరణ్ సర్కార్‌కు నూకలు చెల్లిపోతున్నాయంటూ కేకలు వేస్తున్నాయి. అవిశ్వాసం విషయంలో జగన్ పార్టీ చాలా తెలివిగా దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని జనాన్ని నమ్మించేందుకు ... పదేపదే అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నాక కూడా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని హడావిడి చేస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించండి మద్దతిస్తాం లేదా మేమే అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తాం మీరు మద్దతివ్వండంటూ టీడీపీ ముందు జగన్ పార్టీ నేత మైసూరారెడ్డి ఓ తెలివైన ప్రతిపాదన కూడా ఉంచారు. అయితే ఇందుకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతూ మీకు మద్దతిస్తున్న ఓ ఐదుగురు ఎమ్మెల్యేలను గవర్నర్ దగ్గరకు పంపితే కిరణ్ సర్కార్ కూలిపోతుందని సలహా ఇచ్చింది. ప్రజాసమస్యలపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము సిద్ధమేనని అయితే... జగన్ బేరసారాలు, బ్లాక్ మెయిల్ కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
అటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా కిరణ్ సర్కార్ మనుగడపై అనుమానం వ్యక్తం చేశారు. మరో 15 రోజులకు మించి కిరణ్ ప్రభుత్వం కొనసాగే సూచనలు లేవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పతనాన్ని ఆపే శక్తి ఎవరకీ లేదన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెడితే... తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అయితే... విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ పార్టీకి దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్టు సవాల్ విసిరారు. టీడీపీతో కుమ్మకై రాజకీయాలు నడుపుతోంది జగన్ పార్టీయేనని విమర్శించారు