ముల్తానీలు..! ఈ పేరు వింటేనే ఆదిలాబాద్ జిల్లా ఉలికిపడుతుంది. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాలు ఆగమాగమై పోతాయి. ముల్తానీల కర్కశత్వాన్ని గురించి కథలు కథలుగా గుసగుసలు పోతాయి. అటవీ, పోలీసు అధికారుల ఫైళ్లు.. వారి నేరాల గురించి రికార్డు.. రికార్డులుగా చాటుతాయి. వారి వద్దకు వెళ్లడమే తప్ప తిరిగి వచ్చిన వారు లేరన్న ప్రచారమూ ఉంది. ఇంతకీ ఎవరీ ముల్తానీలు.. ఏమిటి వీరి కథ..? వీరి గురించి సాగుతున్న ప్రచారంలో వాస్తవమెంత..? వారి గోస ఏంటి.. వారెందుకిలా మారారు..? ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది.. టెన్ టివి.
ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో....
ముల్తానీ..! ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో నివసించే ఓ ముస్లిం తెగ. అడవుల్లో చెట్లను నరకడం.. కలపను దుంగలుగా మార్చి.. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం.. వచ్చిన కాస్తో కూస్తో డబ్బుతో పొట్టపోసుకోవడం.. ఇదీ ఇక్కడి ముల్తానీల జీవన విధానంపై సమాజానికి ఉన్న దృక్కోణం. అడవిని హరించడమే కాదు.. హైవేలపై లారీలను హైజాక్ చేస్తారని.. ఆ లారీల్లో కలపను స్మగ్లింగ్ చేస్తారని.. అడ్డు చెప్పే వారిపై కర్కశ దాడులకు తెగబడతారన్నదీ ముల్తానీలపై ఉన్న ప్రచారం. అటవీ, పోలీసు అధికారులదీ ఇదే భావన.
బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు....కానీ...
ఇచ్చోడ మండలంలోని ఈ నాలుగైదు ముల్తానీ గ్రామాల గురించి బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు. కానీ.. జిల్లాలో ముఖ్యంగా అటవీ పరిసరాల ప్రజలకు మాత్రం వీరి గతం.. వర్తమానం.. చిరపరిచితం. అవిభక్త భారతదేశంలో.. పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు.. ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చారు. ఆ తర్వాత దేశం రెండుగా విడిపోయినా వారు మాత్రం.. భారత్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు వారి వారసులు.. ఇక్కడే నాలుగైదు గ్రామాల్లో స్థిరపడిపోయారు.
ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ.....
ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ జంకుతారన్న ప్రచారం జిల్లాలో ఉంది. చెకింగ్స్‌లో దొరికినప్పుడు కేసులు పెట్టడం వరకే రక్షక భటులు పరిమితమయ్యారనీ అంటారు. ఇంతటి నేర చరిత్ర ఉందన్న ప్రచారం వల్ల... ఈ గ్రామంతో సత్సంబంధాలు పెట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని.. భయంకరమైన పల్లెలుగా చెప్పుకునే ఈ ముల్తానీ గ్రామాల్లో వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు.. ఆ గ్రామాల్లో పర్యటించాను.
ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో....
ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో మీడియా కూడా ఇంతకాలం ఈ గ్రామాలకు వెళ్లిందే లేదు. అధికారులు చెప్పిన కథలనే కథనాలుగా ప్రచురించి, ప్రసారం చేసింది మీడియా. ఈ నేపథ్యంలో.. ముల్తానీలు నివసించే గుండాల గ్రామాన్ని సందర్శించాను. స్థానికులను పలుకరించాక.. వారిపై బాహ్యప్రపంచంలో జరుగుతున్న ప్రచారానికీ.. వాస్తవానికి ఏమాత్రం పొంతన లేదని తేటతెల్లమైంది. నరకడం సంగతి అటుంచి.. ఎంతో గౌరవంగా తమ స్థితిగతులను చూపుతూ.. హృదయాంతరాళలోని వేదనను వ్యక్తీకరించారు.
పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు....
నిజాం ప్రభువుల కాలంలో... పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు ఆదిలాబాద్ జిల్లా వచ్చారు. పాక్‌లో వీరి ప్రాంతం పేరును బట్టే.. వీరిని ముల్తానీలుగా పిలుస్తున్నారు. వీరి సంతతి ఇచ్చోడ పరిసరాల్లోని సిరికొండ, వాయిపేట్, గుండాల, జోగిపేట్, కేశవపట్నం, ఎల్లమ్మగుట్లల్లో తప్పించి మరెక్కడా కనిపించదు. వీరు పూర్తిగా టేకు చెట్లను నరకడమే వృత్తిగా జీవిస్తున్నారని.. ఆ క్రమంలో ఎంతటి నేరానికైనా తెగిస్తారనీ ప్రచారంలో ఉంది. ముల్తానీలు చూడ్డానికి సన్నగా రివటలా కనిపిస్తారు. కానీ ఎంతపెద్ద టేకు దుంగనైనా ఇట్టే ఎత్తడమే కాకుండా, ఎంత దూరమైనా మోసుకుపోయే శక్తి కలిగి ఉంటారన్నది అటవీ అధికారుల కథనం.
అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. ...
అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. స్మగ్లింగ్‌తో పాటు ఆదాయం కోసం కొంత మంది ముల్తానీలు అడ్డదారులు తొక్కారు. ఆ చెడ్డపేరు ముల్తానీలందరిపైనా పడింది. కలప రవాణ కోసం లారీలను హైజాక్ చేయడం.. దారి దోపిడిలకు పాల్పడడం లాంటివి ముల్తానీలందరికీ మాయని మచ్చను తెచ్చిపెట్టాయి. తద్వారా సమాజానికి వీరిని దూరం చేశాయి.
. ప్రాథమిక విద్యకూ వీరు దూరం...
ముల్తానీల కర్కశత్వం గురించిన ప్రచారంతో.. అధికారులెవరూ ఈ గ్రామాల వైపు చూసిన దాఖలాలు లేవు. ప్రాథమిక విద్యకూ వీరు దూరమయ్యారు. పిల్లలను బయటి ప్రాంతాల్లో చదివిద్దామనుకున్నా.. వీరికి ఆర్థిక స్థోమత అడ్డుగా నిలుస్తోంది. ఒకవేళ బయటి ప్రాంతాలకు వెళ్లి ఏదైనా ఉపాధిని వెతుక్కుని... పిల్లలను చదివిద్దామన్నా.. ముల్తానీలు అని చెప్పగానే.. వీరికి ఎవరూ ఉపాధిని ఇవ్వడం లేదు. అటు ప్రభుత్వమూ వీరి గురించి ఆలోచించిన దాఖలా లేదు.
ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని....
ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని.. నిజామాబాద్ ప్రాంత కలప స్మగ్లర్లు వీరికి ఉపాధి కల్పిస్తామని ఆశ చూపుతూ.. కలపను అక్రమంగా కొట్టిస్తున్నారు. అడ్డుకున్న అటవీ అధికారులపై.. ముల్తానీలతోనే దాడులు చేయించేవారు. ఉపాధిని అడ్డుకుంటున్నారన్న కోపంతో.. ముల్తానీలూ ఒకేతాటిపైకి వచ్చి.. అటవీ, పోలీసు అధికారులపైనా దాడికి తెగబడేవారు. దీంతో ముల్తానీలు తరచూ కేసుల్లో ఇరుక్కోవడం.. జైలు పాలై శిక్ష అనుభవించడం రివాజుగా మారింది. అధికారులు కూడా ఏళ్ల తరబడి వీరిపై కసి పెంచుకున్నారే తప్ప.. సమస్య మూలాలను అన్వేషించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ముల్తానీలు తరతరాలుగా దుష్టులుగానే ముద్రపడిపోయారు.
అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్...
అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగించిన అటవీ అధికారులు.. కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. దీంతో.. స్మగ్లర్లకన్నా.. ముల్తానీలే ఎక్కువగా నష్టపోయారు. పైగా ఇళ్లల్లోకి పోలీసులు జొరబడి వేధిస్తుండడంతో మరింత వేదనకు గురవుతున్నారు. మారిన ముల్తానీల కుటుంబాల బాగోగుల కోసం.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని వీరి గురించి బాగా తెలుసుకున్న వారు అంటున్నారు. పొలాల్లో బోర్లు తవ్వడం.. వ్యవసాయ రుణాలు ఇప్పించడం లాంటి ప్రోత్సాహకాలు అందించాలనీ సూచిస్తున్నారు.
సర్కారు తరఫున సహాయం అందించేందుకు..
సర్కారు తరఫున సహాయం అందించేందుకు.. ఇప్పుడిప్పుడే కొందరు అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ముల్తానీల కోసం ప్రత్యేకంగా ఆరు ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని.. పూర్తిగా వర్షాధారితమైన వీరి వ్యవసాయ భూముల్లో బోర్లు వేయించాలని.. ప్రత్యామ్నాయ వృత్తివైపు వీరిని మళ్లించాలని.. రాయితీపై రుణాలు అందించాలంటూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలూ కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకుంటే.. ముల్తానీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సమాజానికీ మేలు జరుగుతుంది.
No comments:
Post a Comment