జైలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ రెడ్డి ని ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలవడం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినందుకు అభినందించడానికి జగన్ ను కలిశానని ఒవైసీ చెప్తున్నది ఎంతవరకు నిజం..? రాష్ట్ర రాజకియాలను ఈ కలయిక ఏ మేరకు ప్రభావితం చేయనుంది..? ఈ ములాకత్ మామూలుదేనా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కాకుండా బహిరంగంగా జైలు వద్దకు వెళ్లి జగన్ ను కలిసిన ఇతర పార్టీ నేత ఒవైసీ ఒక్కరే కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
సోనియా వ్యూహం..!
జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైలులో అసదుద్దీన్ ఒవైసీ కలవడంపై పలు కారణాలున్నట్లు తెలుస్తోంది....మొదటి విషయంగా రాష్ట్రపతి ఎన్నికల రాయభారం కోసమే అయింటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటె ప్రణబ్ రాష్ట్రపతి కావాలని నిర్ణయించిన సోనియా ఆ దిశగా వ్యుహాలు అల్లుతోంది అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్దంగా లేరు. అందులో భాగంగానే జగన్ మద్దతు కూడగట్టేందుకు ఓవైసి ని పంపిందని అసదుద్దిన్ మాటల్లో తేటతెల్లమైంది. రాష్ట్రపతి అభ్యర్దికి మద్దతును ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు నేరుగా జగన్ ను కలిసి కోరే అవకాశం లేనందున ఒవైసీతో చెప్పించి ఉండే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో విజయం సాదించిన వెంటనే పాతకక్షలన్ని పక్కనపెట్టి విజయమ్మకు ప్రధాని మన్మోహన్ ఫోన్ చేసి మరి అభినందించడం వెనక ప్రధాన కారణం కూడా ఇదే అయింటుంది. ప్రణబ్ పై పర్సనల్ గా సదుద్ధేశంతో ఉన్న జగన్ ఆయనకే మద్దతిచ్చెందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
పాచిక ఫలించేనా..?
ఇక రెండోది కాంగ్రెస్ అధిష్టానం కాళ్ల బేరానికి వచ్చిందని అందులో భాగంగానే ఓవైసి ని ఢిల్లీ పెద్దలు రాయబారానికి పంపారని ఓవైసీ మాటల్లో తేటతెల్లం అయింది. మొన్నటి బై ఎలక్షన్ రిజల్ట్ ద్వారా చావుతప్పి కన్నులొట్టపోయిన కాంగ్రెస్.. భవిష్యత్ లో నైనా బతికి బట్ట కట్టాలంటే జగన్ తో వైరానికి పులిస్టాప్ పెట్టడంతప్ప వేరే మార్గం లేకుండాపోయింది. అంతా ఒక్కటై జగన్ తో ఆట ఆడుకుంటున్న సమయంలో ప్రజలు గుద్దిన ఓట్లతో మోహం చిట్లిన కాంగ్రెస్.. జగన్ ను దువ్వే పనిలో భాగం కూడా అయింటుంది. అయితే ఓవైసి మాటలను బట్టి మరికొన్ని అర్థాలు కూడా స్పూరిస్తున్నాయి. అందులో ప్రభుత్వ మనుగడ గురించి ఆయన నొక్కి వక్కానించడం , ప్రభుత్వం పడిపోతె అందుకు ఆయన్ని బ్లేమ్ చేయద్దనడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. 2014 వరకు ప్రభుత్వం పడిపోదని అంటూనే పడిపోవద్దని కోరుకుంటున్నానంటునే చిన్న ఝలక్ కూడా ఇచ్చాడు అసదుద్దిన్. ఢిల్లీ రాయబారాన్ని మోసుకొచ్చిన ఓవైసి కి జగన్ ఏం మంత్రం చెప్పారో కాని అటు కేంద్రం మాట చెబుతూనే జగన్ మంత్రాన్ని మీడియా ముందుంచాడు ఈ ముస్లిం నేత.
జగన్ మంత్రోపదేశం..
జగన్ మంత్ర సారాంశాన్ని ఓ సారి పరిశీలిస్తే .. ప్రభుత్వాన్ని పడగొట్టాలని జగన్ భావిస్తే ఎంఐఎం లాంటి పార్టీల సహకారం అవసరం ఎంతైనా ఊంటుంది. జగన్ కు సపోర్ట్ చేయాలంటే, కిరణ్ కుర్చి కూలాలంటే ఎంఐఎం కాంగ్రెస్ కు దూరంగా ఉండాలి. అసదుద్దిన్ జైలు బయట మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం పడిపోతే అందుకు ఆయన్ని బ్లేమ్ చేయద్దనడం లో పరమార్థం ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి జైల్లో ఉన్న జగన్ ఏదో భారీ పథక రచన సిద్దం చేస్తున్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది.